
ధాన్యం సేకరణలో జాగ్రత్తలు పాటించాలి
వనపర్తి రూరల్: మండలంలోని నాగవరం రైతువేదికలో గురువారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకేంద్రంతో పాటు పాన్‌గల్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలంలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొనగా.. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ 2024–25 యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తేమశాతం 14 నుంచి 17 శాతం, చెత్తా, తాలు, మట్టిపెడ్డలు 1 శాతం, రంగుమారిన గింజలు 5 శాతం, పూర్తిగా తయారుకాని గింజలు 3 శాతంలోపు ఉండేటట్లు చూసుకోవాలని వివరించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథం మాట్లాడుతూ.. సన్న, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. సన్నరకాలకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించనున్నట్లు చెప్పారు. కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ డీఎం జగన్, వ్యవసాయశాఖ సంచాలకులు మహిత, చంద్రశేఖర్, ఏఓలు, ఏఈఓలు, ఐకేపీ, సింగిల్‌విండో అధికారులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
మదనాపురం/గోపాల్‌పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ సూచించారు. గురువారం మదనాపురంలోని రైతువేదికలో మదనాపురం, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, గోపాల్‌పేటలోని రైతువేదికలో గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల మండలాల ఏఓలు, ఏఈఓలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నరకం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఎండ నుంచి రక్షణకు టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. తూకం పరికరాలు సరైన పద్ధతిలో ఉండాలని, తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మదనాపురంలో జరిగిన కార్యక్రమంలో ఏడీఏ దామోదర్, గోపాల్‌పేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కో–ఆపరేటివ్ అధికారి ప్రసాదరావు ఉన్నారు.