
నేడు జిల్లాకు డీజీపీ రాక
అమరచింత: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ శుక్రవారం జిల్లాకు వస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మొదట ఐజీ రమేశ్‌రెడ్డి స్వగ్రామం అమరచింత మండలం మస్తీపురంలో సీసీ కెమెరాలను ప్రారంభించి, మధ్యాహ్నం 12.30 గంటలకు జూరాల ఎడమ కాల్వ వద్ద పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తకోట రోడ్ రాజపేట వద్ద గాయత్రి పోలీస్ పెట్రోల్ బంక్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన, సాయంత్రం 4 గంటలకు జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయం దగ్గర జిల్లా పోలీసు సాయుధదళ కార్యాలయ భవనం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం పోలీసు అధికారులతో సమావేశమవుతారని వివరించారు.
30 పోలీస్ యాక్ట్
అమలు : ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడేలా కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసర విషయాలు, రాజకీయ నాయకులు, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిచేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
వివక్ష అంతానికి
పోరాడుదాం : సీఐటీయూ
వనపర్తి రూరల్: శ్రమ దోపిడీ, సామాజిక అణిచివేత, వివక్ష అంతానికి పోరాడుదామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు కొనసాగుతుందని.. సీఐటీయూ అనుబంధ సంఘాల కార్మికులందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహమూద్, బొబ్బిలి నిక్సన్, ఆర్‌ఎన్ రమేష్, బుచ్చమ్మ, మదన్ తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాకు డీజీపీ రాక