
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్‌ఏక్యూ నిబంధనలు విధిగా పాటించాలని.. తేమ శాతం నిర్దేశించిన స్థాయికి వచ్చిన వెంటనే తూకం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. ధాన్యం శుభ్రతపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఒక కేంద్రంలో ఒకే రకమైన ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రతి కేంద్రంలో ఫ్యాన్లు, సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు కచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో మార్కెటింగ్ అధికారిని సంప్రదించాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన వెనువెంటనే డాటా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తేనే రైతులకు డబ్బులు జమ అవుతాయని.. వేగంగా జరగాలన్నారు. అనంతరం పెద్దమందడి మండలం వెల్టూర్ శివారులోని ఏఎంసీ ధాన్యం గోదాంను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ధాన్యం నిల్వకు కావాల్సిన పరిస్థితులపై ఆరా తీశారు. ఆయన వెంట పౌరసరఫరాలశాఖ అధికారి జగన్, పీఏసీఎస్‌ల ఇన్‌చార్జ్‌లు తదితరులు ఉన్నారు.