మొగిలయ్యను పరామర్శిస్తున్న ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వైద్యబృందం
కాశిబుగ్గ: వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న ‘బలగం’సినిమాలో నటించి, పాటతో మెప్పించిన మొగిలయ్యను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం శనివారం పరామర్శించింది. మొగిలయ్య దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ఇటీవల ‘ఆపదలో ఉన్నాం.. తోడుగా నిలవండి’ శీర్షికన ప్రచురితమైన మానవీయ కథనానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. మొగిలయ్యకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు శనివారం ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ నాయక్‌లు సంరక్ష ఆస్పత్రికి చేరుకొని మొగిలయ్యను పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యసేవల గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొగిలయ్య గత సెప్టెంబర్ నుంచి రెండు కిడ్నీలు పూర్తిగా పాడై ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని, ఇటీవల బీపీ, షుగర్ పెరిగి కంటి సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇక్కడ వైద్యసేవలు బాగానే ఉన్నాయని, రోజూ దుగ్గొండి నుంచి రావాలంటే బస్సులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.
వచ్చివెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి మొగిలయ్యకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, మరేమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారి రక్షణకు తెలంగాణ ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నామని మొగిలయ్య దంపతులకు సూపరింటెండెంట్ సూచించారు. సూపరింటెండెంట్ వెంట సంరక్ష వైద్యులు డాక్టర్లు మల్లేష్, దినేష్, సంరక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ నటరాజ్, డాక్టర్ భాస్కర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment