గృహలక్ష్మి లబ్ధిదారులకు ఊరట
పరకాల: జిల్లాలో గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఊరట కలిగింది. ఇళ్ల నిర్మాణ పనులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వర్ధన్నపేట, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు చేరాయి. జిల్లాలో 5,972 ఇళ్లు గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యాయి. పరకాల నియోజకవర్గానికి 1,575, వర్ధన్నపేటకు 1,500, వరంగల్ పశ్చిమకు 2,121, హుస్నాబాద్ నియోజకవర్గానికి 776 ఇళ్లు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 100 మంది లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ స్వయంగా ప్రొసీడింగ్స్ అందించారని వారు కోర్టుకు విన్నవించారు. కోర్టు ఆదేశాలతో గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఇళ్లు ఏ దశల్లో ఉన్నాయో విచారణ జరిపి ఫొటోలతో కూడిన నివేదిక అందజేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, పరకాల మున్సిపల్ కమిషనర్, హసన్‌పర్తి, ఐనవోలు, ఆత్మకూరు, దామెర, నడికూడ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. గృహలక్ష్మీ లబ్ధిదారులు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే విషయం కూడా స్పష్టం చేయాలని సూచించారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుని పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో తమకు ఫలితం దక్కిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల నిర్మాణ పనులపై విచారణకు
కోర్టు ఆదేశం
జిల్లాలో అధికారులకు చేరిన
కలెక్టర్ ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment