అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు●
● వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
కమలాపూర్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ కోసం కమలాపూర్ మండలం అంబాలలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద తనిఖీ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. తనిఖీ సమయంలో సిబ్బంది తప్పనిసరిగా వాహన వివరాలు నమోదు చేసుకోవాలని, ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించాలన్నారు. నిరంతరం ఇసుక రవాణాపై నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం కమలాపూర్ మండలం నుంచి ఇసుక తరలించే అంబాల, నేరెళ్ల వాగులను సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలకు సంబంధించిన వివరాలను స్థానిక ఇన్‌స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతోపాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం కమలాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలతోపాటు ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment