వర్ధన్నపేట.. డిజిటల్ బాట
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ డిజిటల్ బాట పట్టింది. సాగు భూములకు పక్కా నక్షా పట్టాలు ఉన్నట్లుగానే ఈ మున్సిపాలిటీ విస్తీర్ణంలోని అన్ని ఆస్తులను వాస్తవ హద్దులతో ఆన్‌లైన్‌లో నమోదు చేసే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆర్వీ సంస్థతో కలిసి సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్లతో 41.43 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఇల్లు, ఆస్తిని పక్కాగా సర్వే చేసింది. అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులను గుర్తించి డిజిటలైజ్ చేసే దిశగా వేగిరం పెంచారు. వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తున్నారు. త్వరలోనే డిజిటల్ పనిని పూర్తి చేసి వాస్తవిక హద్దులతో సరిపోల్చనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి ఇల్లు లేదా ఆస్తికి ప్రాపర్టీ కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ కార్డులతో ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వమే హద్దులతో కూడిన కార్డులు అందించడం వల్ల ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలుగుతుంది. బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో చిన్న ఇళ్లు, స్థలాలకు సైతం పక్కాగా పట్టాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర పథకం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (ఎన్‌ఏకేఎస్ హెచ్‌ఏ–నక్షా) కింద పట్టణాలకు నక్షాలను రూపొందించే కార్యక్రమానికి వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎంపికై న సంగతి తెలిసిందే.
వర్ధన్నపేట పట్టణంలోని ప్రతి ఇల్లు వాస్తవిక హద్దులను డ్రోన్ల ద్వారా ఫొటోతో క్యాప్చర్ చేశారు. అక్షాంశాలు, రేఖాంశాల (జియో కోఆర్డినేట్స్)తో ఆస్తుల హద్దులు గుర్తించి, వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిశాక పట్టణంలో రెండు వేలకుపైగా ఉన్న ఇళ్లకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్నారు. దీనివల్ల ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరుగుతుంది. అదేసమయంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, చెరువుల విస్తీర్ణం కూడా పక్కాగా తేలనుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్న 12 డివిజన్లలో ఇప్పటివరకు ఆస్తి పన్ను కట్టేవారి సంఖ్య వందల్లోనే ఉంది. 3,200 ఇళ్లు ఉంటే 1,800 మంది ఆస్తి పన్ను కట్టడం లేదు. 1,400 మంది ఇంటి యజమానుల ద్వారా ఏటా సరాసరి రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. ఈ సర్వేతో ప్రతి ఒక్కరి ఇంటికి డిజిటల్ కార్డు ఇవ్వడం వల్ల ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫలితంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి ఏటా ఇంటి పన్ను రూపంలో వచ్చే ఆదాయం మరింత పెరుగనుంది.
●
ప్రభుత్వ పథకాల అమలు సులభం..
డిజిటల్ పక్కా నక్షాతో మున్సిపాలిటీలో ప్రభుత్వ పథకాల అమలు సులభం కానుంది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు గురికాకుండా ఉంటాయి. ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది ఉండదు. అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల గొడవలు సాధ్యమైనంత మేర తగ్గుతాయి. – సుధీర్‌కుమార్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్
డిజిటల్ కార్డుల జారీతో ఆదాయం..
వర్ధన్నపేట.. డిజిటల్ బాట
వర్ధన్నపేట.. డిజిటల్ బాట
వర్ధన్నపేట.. డిజిటల్ బాట
Comments
Please login to add a commentAdd a comment