వైద్యాధికారులు నిబద్ధతతో సేవలందించాలి
ఎంజీఎం: వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, నిబద్ధతతో సేవలందించాలని హనుమకొండ ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ విజయకుమార్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పూరిగుట్ట బస్తీ దవాఖాన, వడ్డేపల్లి యూపీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అక్కడ అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించారు. రక్త, మూత్ర పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్న శాంపిళ్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాయి సేవా ట్రస్ట్, స్పందన వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హరిత, మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ మాధవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల
ఏర్పాట్ల పరిశీలన
హన్మకొండ కల్చరల్: ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వివిధ శాఖల అధికారులు వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. శివరాత్రికి వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీపీ అంబర్ కిషోర్ ఝా సూచన మేరకు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ సతీశ్, పోలీస్ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ, పురావస్తుశాఖ సిబ్బంది.. దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ శివరాత్రి రోజు సాయంత్రం జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారం జాగారం చేసే భక్తుల కోసం పండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి ఆహ్వానపత్రికను అందజేశారు.
రేపటి నుంచి
నాటికల పోటీలు
నయీంనగర్: ఈనెల 23 నుంచి 26 వరకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, వనం లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక నాటిక సంస్థలను ఆహ్వానించినట్లు తెలిపారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. వరంగల్ సహృదయులంతా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏవీ.నరసింహారావు, టి.లక్ష్మణరావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
విద్యార్థినులకు
ఫుడ్ పాయిజన్
నయీంనగర్: హనుమకొండ కిషన్‌పుర ఆర్డీ జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం హాస్టల్లో తిన్న భోజనం వికటించి ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వారిని వెంటనే కళాశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. అనంతరం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయికి ఫీవర్ వచ్చింది.. వచ్చి తీసుకెళ్లండని వారికి అప్పగించి ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులు కొందరు కడుపునొప్పితో బాధపడుతుండగా.. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హనుమకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. కళాశాల డైరెక్టర్ మల్లేశంను వివరణ కోరగా.. తమ కాలేజీలో అలాంటి ఘటనేమీ జరగలేదని సమాధానమిచ్చారు.
వైద్యాధికారులు నిబద్ధతతో సేవలందించాలి
వైద్యాధికారులు నిబద్ధతతో సేవలందించాలి
Comments
Please login to add a commentAdd a comment