దుగ్గొండి: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శర్మ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫిక్షన్ కథల పోటీల్లో నాచినపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిషిత ప్రతిభకనబరిచిందని ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఆమె మాట్లాడుతూ కౌమార బాలికల కోసం శర్మ సంస్థ నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి విద్యార్థిని నిషిత రాసిన ‘మనభవిష్యత్.. మనచేతిలోనే’ అంశానికి ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు శర్మ సంస్థ నుంచి అందిన నగదు బహుమతిని ఎంఈఓ వెంకటేశ్వర్లు శనివారం నిషితకు అందించారు. విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు వెలిదండి సుమలత, సుధీర్‌కుమార్, మధుసూదన్, శ్రీనివాస్, గీత, మాధవరావు, కమల అభినందించారు.
6 నుంచి ‘కొమ్మాల’
బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత 10వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం, 14న హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం అవుతుందని, 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జాతర ఉగాది వరకు కొనసాగుతుందని తెలిపారు.
బాధ్యతలు
చేపట్టిన ఎస్‌ఈలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.మధుసూదన్‌రావు, వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హనుమకొండ ఎస్‌ఈగా పని చేసిన వెంకటరమణ చీఫ్ ఇంజనీర్ పదోన్నతిపై కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లగా ఆ స్థానంలో వరంగల్ ఎస్‌ఈగా పని చేస్తున్న పి.మధుసూదన్‌రావును బదిలీ చేశారు. అలాగే కార్పొరేటర్ కార్యాలయం ఆపరేషన్ విభాగం–1 జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న గౌతమ్ రెడ్డిని వరంగల్ ఎస్‌ఈగా నియమితులయ్యారు.
విద్యార్థుల్లో విలువలను
పెంపొందించాలి : డీఈఓ
నర్సంపేట రూరల్: విద్యార్థుల్లో విలువలను పెంపొందించాలని డీఈఓ జ్ఞానేశ్వర్ అన్నారు. లక్నెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మంచి అలవాట్లను అవర్చుకోవాలని, చదువులో రాణించాలని సూచించారు. అదేవిధంగా గురిజాల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సదానందం ప్రసంగించారు.
బెదిరించిన వారిపై కేసు
సంగెం: చంపుతామని బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకోవడానికి గత నెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన ఆలకుంట రంజిత్‌కు సదరు యువతి మేనత్త కూతురు. రంజిత్‌తోపాటు అదేగ్రామానికి చెందిన రాకేశ్, రజినీకాంత్, వల్లేపు రాజేశ్ ఆమెను వెతికేందుకు శనివారం చింతలపల్లికి వెళ్లారు. రైల్వేగేట్ వద్దకు వెళ్లేసరికి చింతలపల్లికి చెందిన అల్లెపు శ్యాం, కార్తీక్, మల్లేశ్ వారిని అడ్డుకుని దూషించి దాడి చేశారు. మళ్లీ ఇటువైపు వస్తే చంపుతామని బెదిరించారని రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యాం, కార్తీక్, మల్లేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment