
భద్రకాళి చెరువు పనులపై బడా నాయకుల కన్ను?
క్యూబిక్ మీటర్‌కు
రూ.162.56 నుంచి
రూ.71.83కు తగ్గింపు
● పట్టుబట్టి రేట్లు తగ్గించినట్లు ప్రచారం
● అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే యత్నం
● అందుకే.. టెండర్ల దశలోనే బాలారిష్టాలు
● మరోసారి 5వ తేదీ వరకు టెండర్ల తేదీ పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్:
భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు మహూర్తం కుదరడం లేదు. యాభై ఏళ్ల తర్వాత పూడిక తీసేందుకు సుమారు మూడున్నర నెలల క్రితం చెరువు నుంచి నీళ్లు ఖాళీ చేశారు. వెంటనే టెండర్ ద్వారా చెరువు నుంచి పూడిక మట్టి తవ్వకం, లోడింగ్, తరలింపు పనులు చేపట్టేందుకు నిర్ణయం జరిగింది. ఈమేరకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో సమీక్ష కూడా నిర్వహించారు. నీటి పారుదల శాఖ ద్వారా మొత్తం రూ.13,00,09,046 వ్యయంతో రెండు పనులకు రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా పనులు ఖరారు కాలేదు. అయితే ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వెనుక అసలు మతలబు.. కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, అనుకూలురైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే క్రమంలో ప్రయత్నాలు చేస్తుండడమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో మొదట మట్టి తవ్వకం, తరలింపు పనులకు క్యూబిక్ మీటర్ ధర రూ.162.56 ప్రకటించిన అధికారులు.. సవరణ, సాంకేతిక కారణాల పేరిట క్యూబిక్ మీటరుకు రూ.71.83లుగా ఖరారు చేశారన్న చర్చ జరుగుతోంది.
రేట్ల తగ్గింపుపై అనుమానాలు..
భద్రకాళి చెరువు పూడిక పనుల ఖరారులో ఆలస్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా అధికారులు.. మొదట ఇద్దరు టెండర్లు వేస్తే తక్కువ కోట్ చేశారని రద్దు చేశారు. ఆతర్వాత క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 ఉన్న ఽరేటును రూ.71.83లు తగ్గించి.. నాన్ యూజ్ ఫుల్ సాయిల్‌గా గుర్తించి జీఎస్టీ, మెటీరియల్ కాస్ట్ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టర్లు తక్కువ కోట్ చేశారని మొదట టెండర్లు రద్దు చేసిన అధికారులు.. క్యూబిక్ మీటర్‌కు రూ.90.73 (సగానికి పైగా) తగ్గించడం పథకం ప్రకారమేనన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు కొందరు ప్రజాప్రతినిధులు ఈ పనులపై కన్నేసి అనుకూలురకు ఇప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందనే ప్రచారం ఉండగా.. మరోవైపు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి బంధువుకు కావాలని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వేసవి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో.. ఖాళీ అయిన భద్రకాళి చెరువు కారణంగా నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తుండగా.. కలెక్టర్లు సైతం ఇరిగేషన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పనుల చేజిక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు, ఒత్తిళ్ల కారణంగా టెండర్ల ఖరారులో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
సెలవుల వల్ల గడువు పొడిగింపు..
పూడికతీతలో వచ్చే నల్లమట్టి కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 5 వరకు పొడిగించాం. మొదట ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు సమయం ఇచ్చాం. అయితే వరుస సెలవులు రావడంతో డీడీలు తీసుకునే చివరి తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఈనెల 5 వరకు పొడిగించాం. మట్టి కావాల్సిన వ్యక్తులు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– ఎం.శంకర్, ఈఈ,
నీటిపారుదలశాఖ నక్కలగుట్ట డివిజన్
వాయిదాల టెండర్లు..
భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచారు. పూడిక తవ్వడం, లోడింగ్ పనులకు రూ.3,49,11,446 కేటాయించారు. అలాగే పూడిక మట్టిని తరలించేందుకు క్యూబిక్ మీట రుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబి క్ మీటర్లకు రూ.9,50,97,600 చెల్లించేలా.. మరో టెండర్ పిలిచారు. ఈపనుల కోసం కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగానే ముందుకు రాలేద న్న చర్చ జరుగుతోంది. ఈసమయంలో మట్టి తవ్వకం, లోడింగ్ పని కంటే.. పూడిక మట్టి తరలించే పనికి సంబంధించిన టెండర్ నోటిఫికేష న్‌లో నిబంధనలు కఠినంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని అధికారులు చెప్పుకొచ్చారు. పూడికతీత, లోడింగ్, తరలింపు పనులను అత్యవసరంగా భావించిన అధికారులు రెండోసారి టెండర్లు పిలిచినా ఫలితం లేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫిబ్రవరి 28న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా మరోసారి టెండర్లు పిలిచారు. తాజాగా మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment