నేడు వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్ కు రావాలని కలెక్టర్ సూచించారు.
హనుమకొండ ప్రజావాణి రద్దు
హన్మకొండ అర్బన్ : నేడు(సోమవారం) హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
శ్రీపాదరావుకు ఘన నివాళి
హన్మకొండ అర్బన్/వరంగల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, రెండు జిల్లాల డీఆర్‌ఓలు వైవీ.గణేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి పీజీ కోర్సుల
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్‌ఎల్.సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మొదటి పేపర్, 5న రెండోపేపర్, 7న మూడో పేపర్, 10న నాలుగో పేపర్, 12న ఐదో పేపర్, 15న ఆరో పేపర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 4,914 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 25 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నేడు కలెక్టరేట్‌లోకి
డీఎంహెచ్‌ఓ కార్యాలయం
హన్మకొండ అర్బన్: ఊరు చివరనున్న హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎట్టకేలకు కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి మారనుంది. ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగించుకుని కలెక్టరేట్ రెండో అంతస్తులో కేటాయించిన ఎస్ 14, 16, 17 గదుల్లోకి రానుంది. అధికారికంగా సోమవారం కలెక్టర్ ప్రావీణ్య కార్యాలయాన్ని ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి సామగ్రి తరలించారు. అలాగే ఈనెల 4న క్షేత్రస్థాయిలో వైద్యాధికారులతో నిర్వహించే సమాశాన్ని కూడా కలెక్టరేట్ చేపట్టనున్నట్లు డీఎంహెచ్‌ఓ వైద్యాధికారులకు సమాచారం పంపించారు.
అరుణాచలానికి
ఆర్టీసీ ప్రత్యేక బస్సు
హన్మకొండ: అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు ఆదివారం తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నారు. 15న జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం దర్శనం అనంతరం హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం 99592 26047, 94941 07944 నంబర్లలో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment