ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
సాక్షిప్రతినిధి, వరంగల్:
...ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని తొమ్మిది జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ఉంది. మూడో దశలో భూసేకరణ చేపట్టని కారణంగా సుమారు ఆరేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు 91 శాతం వరకు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుండగా.. కీలకమైన 9 శాతం పనులు పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఉన్నతాధికారులు 2024 ఆగస్టులో ప్రాజెక్టును పరిశీలించారు. సమీక్ష నిర్వహించి వెంటనే భూసేకరణ చేపట్టి పూర్తి చేస్తామని ప్రకటించినా.. ఆదిశగా అడుగులు పడలేదు.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2004లో శ్రీకారం చుట్టింది. తొమ్మిది జిల్లాల్లో సుమారు 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్‌సైజ్ మూడోదశను దాటించలేకపోతున్నది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధి 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది.
భూసేకరణే సమస్య..
ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది.
పెరిగిన అంచనా వ్యయం
2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.
‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్‌ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం.’
– 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి.
●
ప్రాజెక్టు వెంటనే
పూర్తి చేయాలి..
దేవాదుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఇరవయ్యేళ్లవుతున్నా అసంపూర్తి ప్రాజెక్టుగానే ఉంటున్నది. అలాగే రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే నక్కలతూముకు కాల్వలు నిర్మించి నీటిని సరఫరా చేయాలి.
– బొడ్డు ప్రతాప్, రైతు, ధర్మసాగర్
భూసేకరణ ప్రక్రియ
జరుగుతోంది..
ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. జనగామ జిల్లాలో 200 మంది రైతులకు టోకెన్లు ఇచ్చాం. మిగతా ప్రాంతాలు, గ్రామాల్లోనూ మాట్లాడుతున్నాం. 2026 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా రైతులను సంప్రదించి భూసేకరణ చేస్తున్నారు.
– సుధాకర్, ఎస్‌ఈ, దేవాదుల ప్రాజెక్టు
దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య
ఇరవయ్యేళ్లయినా
అసంపూర్తిగానే ప్రాజెక్టు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక
మంత్రుల పర్యటన
హామీలు, ఆదేశాలు..
అయినా పూర్తికాని భూసేకరణ
రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు.. పెరిగిన అంచనా వ్యయం
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
Comments
Please login to add a commentAdd a comment