నేడు కంఠమహేశ్వర స్వామి కల్యాణోత్సవం
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి గ్రామంలో కంఠమహేశ్వరస్వామి–సురమాంబాదేవి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం గౌడకుల దీక్షాస్వాములు, మహిళలు బిందెలతో నీటిని తీసుకుని ఆలయానికి చేరుకుని జలాభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, నవగ్రహ, వాస్తు పూజ, గండుదీపం, గణపతి హోమం అనంతరం సురమాంబాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాత్రి భక్తి సురమాంబాదేవి నాటకాన్ని ప్రదర్శించారు. సోమవారం బోనాలతో తరలివెళ్లి ఆలయం వద్ద స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని పూజారులు ఏరుకొండ శ్రీనివాస్, యెలగంగూరి రఘువర్మ తెలిపారు. మంగళవారం ఎల్లమ్మ, మైసమ్మ తల్లులు, మోకు ముస్తాదు, కులవృక్ష పూజలు, గావుపట్టి బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కుల సంఘం పెద్దలు బొడిగె శోభన్, సదానందం, భీమగాని రాంచందర్, యాదగిరి, గోసుగొండ జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంట్లో సామగ్రి ధ్వంసం
● ఐదుగురిపై కేసు నమోదు
● ప్రేమ వివాహంతో
దాడులు, ప్రతిదాడులు
సంగెం: ప్రేమ వివాహం విషయంలో దాడులు, ప్రతిదాడులతో కేసులు నమోదవుతున్నాయి. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ భవానీనగర్‌లో ఉండే వల్లెపు సాంబమూర్తి పెద్ద కూతురు సుష్మితను సంగెం మండలం కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన ఆలకుంట ఎల్లయ్య చిన్న కుమారుడు అరుణ్ గత నెల 27న ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కూతురును అరుణ్ కిడ్నాప్ చేశాడని సాంబమూర్తి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అరుణ్ తండ్రి ఎల్లయ్య, తల్లి కోమల, అన్న రాజ్‌కుమార్ భయపడి చింతలపల్లిలోని ఎల్లయ్య అక్క కమలమ్మ ఇంటికి వెళ్లి ఉన్నారు. శనివారం అరుణ్, సుష్మిత ప్రేమ వివాహం చేసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలుసుకుని ఆదివారం ఎల్లయ్య కుటుంబంతో వడ్డెరగూడెంలోని ఇంటికి వెళ్లాడు. ఇంటి పైకప్పు పెంకులు, ముందు రేకులు, ఇంట్లోని ద్విచక్రవాహనం, టీవీ, ఫ్రిజ్, కూలర్ సుమారు రూ.65 వేల విలువైన సామగ్రిని సుష్మిత తల్లిదండ్రులు వల్లెపు సాంబమూర్తి, రజిత, బంధువులు పూలమ్మ, భవాని, చంద్రమ్మ ధ్వంసం చేశారని ఆలకుంట ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
అరుణాచలానికి బస్సు
హన్మకొండ: అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయలుదేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నా రు. 15న హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. 99592 26047, 7382855793 నంబర్లలో సంప్రదించాలన్నారు
నేడు కంఠమహేశ్వర స్వామి కల్యాణోత్సవం
Comments
Please login to add a commentAdd a comment