ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 5 నుంచి ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్, జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 39,980 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 7, టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్‌కళాశాల 1, టీఎస్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 2, మోడల్ స్కూళ్లు 3, ప్రైవేట్ అండ్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 42 మొత్తం 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు 42 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఇన్విజిలేటర్లను 1,050 మందిని నియమించారు. సెల్ఫ్ సెంటర్లు లేవు. సమస్యాత్మక కేంద్రాలు కూడా లేవు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి.
పకడ్బందీగా నిర్వహించేందుకు..
పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాన్ని బట్టి 3 నుంచి 5 వరకు సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆయా కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లుంటే పరీక్షల సమయంలో వాటిని మూసేస్తారు. పోలీస్‌బందోబస్తు కొనసాగనుంది.
ముందుగానే చేరుకోవాలి..
ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం లేటయినా.. అనుమతించరు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని అనుమతించరు. విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నా.. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవి..
హనుమకొండ జిల్లాలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా.. విద్యార్థులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. చంద్రమౌళి, సూపరింటిండెంట్ 9491559360, పి.సుచిరిత, సీనియర్ అసిస్టెంట్ 9966440775, వికాస్, జూనియర్ అసిస్టెంట్ 9502743435లో సంప్రదించవచ్చు.
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ వరంగల్ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు, వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో 26 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏన్‌ఎంలు, పోలీస్ శాఖ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏవైనా సందేహాలున్నా.. 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు బృందాల సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఉంటుంది. డీఐఈఓ కన్వీనర్‌గా, ఇద్దరు ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. హైపవర్ కమిటీ కూడా ఉంటుంది. కలెక్టర్ చైర్మన్‌గానూ, పోలీస్ కమిషనర్, ఇంటర్ విద్య ఆర్జేడీ డెక్, డీఐఈఓ, సీనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా చర్యలు తప్పవు.
– ఎ.గోపాల్, డీఐఈఓ
రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ
హనుమకొండ జిల్లాలో 39,980 మంది
వరంగల్ జిల్లాలో 12,321 విద్యార్థులు
కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా
నిమిషం నిబంధన, 144 సెక్షన్ అమలు
హనుమకొండ జిల్లాలో ఇలా..
ఫస్టియర్ జనరల్ : 18,397
ఒకేషనల్ : 1,146
సెకండియర్ జనరల్: 19,480
ఒకేషనల్ : 957
మొత్తం విద్యార్థులు : 20,437
వరంగల్ జిల్లాలో..
ఫస్టియర్ జనరల్ : 4,967
ఒకేషనల్ : 848
సెకండియర్ జనరల్: 5,739
ఒకేషనల్ : 767
మొత్తం : 12,321
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment