6 నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి 20 వరకు వైభవంగా జరుగనున్నాయి. జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవంతో ప్రారంభం కానున్నాయి. 7న ఉదయం 5 గంటలకు సుప్రభాతం, బిందె తీర్థం పూజలు, 8న నిత్యనిధి, పరమపదోత్సవం, 9న ఉదయం 10 గంటలకు సూత్తందాది, శాత్తుమర, అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షా వస్త్రాధారణ, అగ్నిప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచారి తెలిపారు. 10న రాత్రి భూదేవి, నీలాదేవితో స్వామి వారి కల్యాణం వైభవంగా జరుగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎదుర్కోళ్లు, అశ్వవాహన సేవ ఉంటాయని తెలిపారు. 11 నుంచి 13 వరకు పలు పూజా కార్యక్రమాల అనంతరం 14న హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని చెప్పారు. అమ్మవార్లతోపాటు స్వామి వారిని గుట్ట దిగువకు తీసుకెళ్లి ప్రత్యేక పూజల అనంతరం వారిని రథంపై కూర్చుండబెట్టి గుట్టచుట్టూ తిప్పే కార్యక్రమం ఉంటుందన్నారు. 19న స్వామివారిని విశ్వనాథపురానికి తీసుకెళ్లి పారువేట, శ్రీపుష్పయాగం, నాగవెల్లి నిర్వహిస్తామని వివరించారు. 20వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, జాతర ఉగాది పర్వదినం వరకు కొనసాగుతుందన్నారు.
10న లక్ష్మీనర్సింహస్వామివారి కల్యాణం
14న జాతర ప్రారంభం
20న ముగియనున్న ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment