ధాన్యం డబ్బులు ఇవ్వాలని ఆందోళన
నల్లబెల్లి: మండల కేంద్రంలో ఐకేపీ కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను ఇవ్వాలని ఓ రైతు కుటుంబ సభ్యులు మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గాజుల రాజేందర్ సన్నధాన్యం పండించాడు. 309 బస్తాలను కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టాడు. నిర్వాహకులు అడిగిన పత్రాలను అందించాడు. అయితే నిర్వాహకులు రైతు ఖాతాలో డబ్బులు జమ చేయకుండా తమ ఖాతాలో జమ చేసుకున్నారు. ధాన్యం డబ్బులు ఇవ్వాలని కోరడంతో నిర్వాహకులు కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు కుటుంబ సభ్యులు సమాఖ్య కార్యాలయం గేటుకు తాళం వేసి ట్రాక్టర్ అడ్డుపెట్టి ఆందోళన చేశారు. డబ్బులు ఇచ్చే వరకు ఆందోళన విరమించేంది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు రైతు కుటుంబ సభ్యులతో చర్చించారు. నిర్వాహకులతో మాట్లాడి రూ.1.38 లక్షలు ఇప్పించారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment