ఇళ్ల పనులు షురూ..
సాక్షి, వరంగల్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనులను గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి 21న నారాయణపేటలో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసే కార్యక్రమం ఆగింది. తమకు శుభ ముహూర్తం ఉందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొనకుండానే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు ముగ్గు పోసుకున్నారు. ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసే కార్యక్రమానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 13 మోడల్ విలేజ్‌ల్లో గుర్తించిన 1,162 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ముగ్గు పోసే సమయంలో తప్పకుండా పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. లబ్ధిదారులు వారికి సమాచారం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో నిర్మాణాల అనంతరం మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీకారం చుడతారు. అక్కడ లబ్ధిదారుల సర్వే సైతం పూర్తయ్యింది. ‘పునాది పనులు పూర్తయిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొదటి విడత రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కూపన్లను తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందాలి’ అని గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారి గణపతి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 2,33,779 దరఖాస్తులు వస్తే 2,32,029 సర్వే పూర్తి చేశాం. తొలుత మోడల్ విలేజ్‌లో ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన గ్రామాల్లో చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
● సొంత స్థలం ఉండి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–1 కింద విభజించారు. వారు చూపిన స్థలాన్ని జియో ఫెన్సింగ్ చేశారు.
● సొంత భూమి లేని వారిని ఎల్–2 జాబితాలో చేర్చారు. వారికి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.ఐదు లక్షలు కేటాయిస్తారు.
● అద్దెకున్నవారు, సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఎల్–3 జాబితాలో చేర్చారు.
ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
13 మోడల్ విలేజ్‌ల్లో
1,162 మంది అర్హులు
పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా
నేతల కార్యక్రమాలు
గ్రామాల వారీగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాల వివరాలు
మండలం గ్రామం ఎల్ 1 ఎల్ 2 ఎల్ 3
చెన్నారావుపేట అమీనాబాద్ 171 29 300
దుగ్గొండి రేకంపల్లి 81 18 225
ఖానాపురం రంగంపేట 129 5 180
నల్లబెల్లి రామతీర్థం 46 13 103
నర్సంపేట పర్శనాయక్ తండా 98 24 79
నెక్కొండ బొల్లికొండ 183 5 300
రాయపర్తి మహబూబ్‌నగర్ 102 9 186
గీసుకొండ కోనాయమాకుల 34 12 338
సంగెం షాపూర్ 134 1 211
పర్వతగిరి జమలాపురం 74 6 126
వర్ధన్నపేట వెంకట్రావుపల్లి 110 14 103
మొత్తం 1,162 136 2,151
Comments
Please login to add a commentAdd a comment