12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Published Sun, Mar 9 2025 1:28 AM | Last Updated on Sun, Mar 9 2025 1:29 AM

12నుం

12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

దుగ్గొండి: మండలంలోని కేశవాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 12 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది జితేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 12న సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, 13న శేషవాహనోత్సవం, 14న శ్రీదేవి–భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణం, సాయంత్రం గరుడ వాహనోత్సవం, 15న హనుమద్వాహన సేవ, 16న అలంకారసేవ, 17న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, శ్రీపుష్పయాగం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన సూచించారు.

రైతులకు పరిహారం

చెల్లించాలి

నెక్కొండ: గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం తోపనపల్లి గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన 15 మంది రైతులు సుమారు 15 ఎకరాల భూములు హైవేలో కోల్పోయారని తెలిపారు. కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం పరిహారం అందిస్తామని కాంట్రాక్టర్‌ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. త్వరగా పరిహారం చెల్లించకుంటే పనులు మళ్లీ అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.

యువకుల నుంచి

డబ్బుల వసూలు!

వర్ధన్నపేట: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు వెంబడించి డబ్బులు వసూలు చేశారనే ఘటన శనివారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కట్య్రాల నుంచి కొత్తపల్లి బైపాస్‌ రోడ్డు వద్ద ఇద్దరు యువకులు మద్యం సేవిస్తున్నారని కానిస్టేబుళ్లు గమనించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లు యువకుల వద్దకు వెళ్లి మీపై కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి పంపించాలా అని బెదిరించారని, వారి నుంచి రూ.1500 చొప్పున ఇతర నంబర్ల ఫోన్‌పేకు బదిలీ చేయించుకున్నారని చర్చ జరుగుతోంది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం వర్ధన్నపేటలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కొత్తూరులో చైన్‌స్నాచింగ్‌

రాయపర్తి: మండలంలోని కొత్తూరులో శనివారం చైన్‌స్నాచింగ్‌ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొంపెల్లి ప్రమీల ఇంట్లో ఉండగా తెల్లవారుజామున 4:30 గంటలకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు కొట్టగా తలుపులు తీసింది. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు ప్రమీలను బెదిరించి మెడలోని బంగారు గొలుసు, చేతులకు ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకొని పారిపోయారు. బాధితురాలు అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని 100కు డయల్‌ చేశారు. ఎస్సై శ్రవణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు1
1/2

12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు2
2/2

12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement