
వినడం.. తీసుకోవడమే
వరంగల్: ప్రతీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు వాపోతున్నారు. ఇచ్చిన వినతులు అధికారులు తీసుకుని ఆన్‌లైన్ చేసి సంబంధిత శాఖ అధికారులకు పంపించడంతో కలెక్టరేట్ అధికారుల పని పూర్తవుతోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు క్షేత్రస్థాయిలో పరిష్కారం అయిందా.. లేదా అన్న విషయంపై సమీక్ష లేకపోవడంతో గ్రీవెన్స్ కార్యక్రమం ఒక అనవాయితీగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో చేసిన ఫిర్యాదు మూడు నెలలు అయినా మళ్లీ అదే సమస్యపై వినతి ఇవ్వడంతో సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బాధితులు చేసిన ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులతో ప్రత్యేకంగా కలెక్టర్ నేతృత్వంలో సమీక్ష జరిగితే న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
పెండింగ్ లేకుండా చూడాలి:
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో అందిస్తున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి ప్రజల సమస్యల పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 103 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై 53 దరఖాస్తులు వచ్చాయన్నారు.
పరిష్కారం కాని ప్రజావాణి దరఖాస్తులు
కలెక్టరేట్‌కు తిరుగుతున్న బాధితులు
సమస్యలు పరిష్కరించాలని
అర్జీదారుల వేడుకోలు
గ్రీవెన్స్‌లో 103 వినతులు
పెండింగ్ లేకుండా చూడాలి:
కలెక్టర్ సత్యశారద
మూడు చక్రాల స్కూటర్ ఇప్పించాలి
పుట్టుకతో పోలియో రావడంతో కుడికాలు పడిపోయింది. పేద కుటుంబానికి చెందడం, వృద్ధురాలైన తల్లిని పోషించుకునేందుకు పనులకు వెళ్లి నడిచి రావాలంటే ఇబ్బంది పడుతున్న. వందశాతం సబ్సిడీతో మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేయిస్తే కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది.
– గుగులోతు భూలక్ష్మి, పల్లారుగూడ, సంగెం

వినడం.. తీసుకోవడమే
Comments
Please login to add a commentAdd a comment