స్క్రాప్ దుకాణంలో కొండచిలువ కలకలం
కమలాపూర్: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గల రాయల్ పాత ఇనుప సామగ్రి దుకాణంలో ఓ భారీ కొండచిలువ ఆదివారం రాత్రి కలకలం సృష్టించింది. స్క్రాప్ దుకాణా యజమాని తాహిర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సమయంలో పాత ఇనుప సామగ్రి కింద తాము ఇటీవల కొనుగోలు చేసిన ఓ పాత బీరువాను కట్ చేయడానికి వెళ్లగా.. అందులో ఓ కొండచిలువ కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఆ కొండచిలువను బీరువాలోంచి ఓ డ్రమ్ములో బంధించినట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎఫ్‌ఆర్‌ఓ శిరీష, డిప్యూటీ ఆర్‌ఓ ప్రిసిల్ల ఆదేశాల మేరకు ఎఫ్‌బీఓ అశోక్, జూపార్క్ సిబ్బంది కొమురయ్య, కృష్ణ, మల్లారెడ్డి వచ్చి సుమారు 12 ఫీట్లకు పైగా ఉన్న కొండచిలువను ఓ గోనె సంచిలో బంధించి జన సంచారం లేని ఓ గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు చెప్పారు. కాగా.. గూడూరు మద్యంతోట శివారు నుంచి వంగపల్లి శివారు వరకు ఉన్న ఎస్సారెస్పీ కాలువ పరిసర ప్రాంతాల్లో తరచూ కొండచిలువలు సంచరిస్తుండడంతో తాము తీవ్ర భాయందోళనలకు గురవుతున్నామని, కొండచిలువలను ఇక్కడి నుంచి జన సంచారం లేని ప్రాంతాలకు తరలించి తమను వాటి బారినుంచి కాపాడాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment