దుగ్గొండి: మండలంలోని కేశవాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆరు రోజులుగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి శ్రీదేవి, భూదేవి, సహిత వేంకటేశ్వర స్వామివార్లకు చక్రస్నానం చేయించారు. సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ద్వాదశావరణం కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బ్రహ్మణోత్తములకు సన్మానం నిర్వహించి ఉత్సవాలను ముగించారు. చివరి రోజు బ్రహ్మోత్సవాలకు దుగ్గొండి, ఆత్మకూరు మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతితో పాటు ఉచిత అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఆలయ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ధర్మకర్తలు జితేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అభినయ్‌రెడ్డి, ఆలయ ఈఓ కిరణ్‌కుమార్, ఉద్యోగి అశోక్, అర్చకులు దేశికన్‌చార్యులు, రంగనాథ్, ప్రదీప్, సాగర్‌స్వామి పాల్గొన్నారు.