నర్సంపేట: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందిస్తున్న సేవలు, గ్రంథాలయాల అభివృద్ధికి చేస్తున్న కృషికి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాసుల రవికుమార్, శోభారాణి దంపతులకు ప్రతిష్టాత్మక బెస్ట్ చైల్డ్ ఇన్షియేటివ్ అవార్డును సీఎస్‌ఆర్ సమ్మిట్ కాన్ఫరెన్స్‌లో అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈకార్యక్రమంలో అవార్డును మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా రవికుమార్ దంపతులు అందుకున్నారు. చదువును ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ రామచంద్రు, సినీ నటి, చేనేత అంబాసిడర్ పూనమ్‌కౌర్, డాక్టర్ అర్చన, హక్కుల కార్యకర్త వైజయంతి, వసంత మొగ్గి, ప్రధాన నిర్వాహకుడు వినీల్‌రెడ్డి, ప్రఖ్యాత కంపెనీల అధినేతలు, సామాజిక కార్యక్తలు సామాజిక బాధ్యత ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఈసందర్భంగా కాసుల రవికుమార్ దంపతులు మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో వికాసం, అభివృద్ధి ఉంటాయన్నారు. నాణ్యమైన విద్య వ్యాప్తికై భవిష్యత్‌లో మరింత కష్టపడి పని చేయడానికి ఈగుర్తింపు ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈచదువుల యజ్ఞంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.