ఎల్కతుర్తి : ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా సాగుకు ఎదురు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. భీమదేరపల్లి మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా మెట్టప్రాంతంలో ఉన్నాయి. కేవలం దేవాదుల కాల్వ, వర్షపు నీరు మాత్రమే ఆయా భూములకు ఆధారం. కాగా ఈ ఏడాది కురిసిన వర్షాలకు చెరువుల్లో, కుంటల్లో నీరు చేరినప్పటికి అవి ఇప్పుడు అడుగంటుతున్నాయి. వ్యవసాయ బావి నీటి ద్వారా పలు గ్రామాల్లోని రైతులు కూరగాయ పంటలు టమాట, బెండ, బీర, వంకాయ ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట ధర రూ.5నుంచి రూ.10కి పడిపోయింది. దీంతో రైతులు కూలీకు ఇచ్చే డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్‌కు తరలించే ఖర్చు, పంట సాగుకు చేసిన ఖర్చులు ఎదురుపెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చేనులోనే వదిలేసి పోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మండలంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసినట్‌లైతే పండించిన పంటలను నిల్వ చేసుకోవచ్చు. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే వీలు ఉంటుందని పలువురు రైతులు మొరపెట్టుకుంటున్నారు.
సాగు విస్తీర్ణం..
భీమదేవరపల్లి మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను 17,847ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో ప్రధాన పంటలైన వరి 11,894 ఎకరాల్లో సాగు చేయగా మొక్కజొన్న 4,365, మామిడి 1,100, ఆయిల్‌పామ్ 256, పొగాకు 53, మల్బరి 19, కూరగాయలు 17 ఎకరాల్లో సాగు చేశారు. స్వీట్ ఆరేంజ్ 80 ఎకరాలు, సన్‌ప్లవర్ 25 ఎకరాలు, సపోటా 11 ఎకరాలు, వ్యవసాయ అధికారులు వెల్లడించారు.
దిగజారిన రేటు
ఆందోళనలో అన్నదాతలు