
ఐనవోలులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
పాఠశాల, పీహెచ్‌సీ,
అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
ఐనవోలు: మండలంలో కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కక్కిరాలపల్లి ప్రభుత్వ పాఠశాలలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న స్ట్రెంథనింగ్ ఎఫ్‌ఎల్‌ఎన్ త్రూ ఏఐ టూల్స్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ వాసంతితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాల్లో రాణించేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తుండగా ప్రత్యక్షంగా పరిశీలించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అదనపు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలన్నారు. పాఠశాలకు చెందిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్‌తో పాటు ఇటీవల కొనుగోలు చేసిన క్రీడా సామగ్రిని పరిశీలించారు. పాఠశాలకు వచ్చిన పలువురు స్ధానికులు సాగు, తాగునీటితోపాటు వీధి దీపాలు, దివ్యాంగుల పింఛన్ తదితర సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న భవనంలోకి మార్చాలని ఆదేశించారు. పున్నేలు జీపీ ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా పాఠశాల ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. చలివేంద్రం నిర్వహణ పరిశుభ్రంగా ఉండాలని ఆమె సూచించారు.
పీహెచ్‌సీ తనిఖీ..
ఐనవోలు పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్య సేవల నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి రోగులతో కలెక్టర్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి? వారి నిర్వహణ గురించి మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సబ్‌సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విక్రమ్‌కుమార్, ఎంఈఓ పులి ఆనందం, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్‌ఐ మల్లయ్య, జీపీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.