
కట్టమల్లన్న ఆలయంలో పెద్దపట్నం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ గొర్రెకుంట కట్టమల్లన్న దేవాలయంలో ఆదివారం పెద్దపట్నం జాతర నిర్వహించారు. మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ ఉత్సవ మూర్తులను రాత్రి గొర్రెకుంట గ్రామం నుంచి పూజారులు మ్యాదరబోయిన కట్టయ్య, యాదగిరి, కొంరెల్లి, కట్టయ్య సంప్రదాయబద్ధంగా ఆలయానికి తోడ్కొని వచ్చి కల్యాణం జరిపించారు. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి కథలు చెప్పారు. ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జాతరకు హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీని ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టమల్లన్న (మల్లికార్జునస్వామి) ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్ గాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పత్తిపాక తిరుపతి, కమిటీ సభ్యులు కట్కూరి సారయ్య, కందుల రమ, మేకల రాధాకృష్ణారెడ్డి, రాజబోయిన శివకుమార్, మార ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కొండేటి కొమురారెడ్డి, ఎలగొండ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.