మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఐనవోలు: ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పంథిని గ్రామంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండల బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన దయాకర్‌రావు, వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యమ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మూడు మండలాలకు చెందిన సుమారు 20వేల మంది జనం సభకు తరలిరావాలని, అందుకు ప్రతీ బీఆర్‌ఎస్ కార్యకర్త కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులు చేపట్టి ప్రజలకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలుగా ఒక్క పనీ ముందుకు సాగడం లేదని విమర్శించారు. వేలాది ఎకరాల పంట నష్టం జరుగుతుందని దేవన్నపేట పంప్‌హౌజ్ వద్ద అధికారులకు మొరపెట్టుకోగా రేపటిలోగా మోటార్లు ఆన్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రుల పర్యటన కోసం పంప్‌హౌజ్ ఆన్ చేయకుండా ఆపడం ప్రభుత్వానికి మంచిది కాదని ఎద్దేవా చేశారు. 24 గంటల్లో నీళ్లు వదలకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఏకమై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. గుజ్జ గోపాల్‌రావు, తక్కెళ్లపెల్లి చందర్‌రావు, వివిధ మండలాల బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.