
24/7 వైద్య సేవలందేలా చూస్తాం
శాయంపేట: ‘మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలందేలా చూస్తాం’ అని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, మెడికల్ ల్యాబ్‌ను పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు. ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ కోసం వచ్చిన మహిళలతో ఆయన మాట్లాడారు. ఉదయం 11:35 గంటల వరకు 32 మంది మహిళలు పరీక్షలు చేసుకున్నట్లు డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ రమాదేవి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతీ మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈసందర్భంగా గర్భిణులకు సూచనలిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందించడానికి ముగ్గురు స్టాఫ్ నర్సులకు, ఒక ఏఎన్‌ఎంకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల వైద్యాధికారి సాయికృష్ణ, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఉన్నారు.
జిల్లా వైద్యాధికారి అప్పయ్య
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ