
నాన్నే నాకు రోల్ మోడల్..
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన మహ్మద్ విలాయత్ అలీ ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో 489.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. జోనల్ స్థాయి బీసీ–ఇ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించి నిరుపేద యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ప్రోత్సాహంతోనే గ్రూప్స్‌లో మంచి ర్యాంకు సాధించాను. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నాం. అనేక కష్టాల్ని అనుభవించాం. అమ్మ షమీమ్– నాన్న మహబూబ్ అలీ. మేం ఐదుగురం. ఇద్దరు అక్కలు. ఇద్దరు చెళ్లెళ్లు. నాన్నకు కుటుంబ పోషణ భారంగానే ఉండేది. నాన్న కష్టాన్ని ఎలాగైనా తీర్చాలనే పట్టుదలతో బాగా చదివాను. మామునూరు స్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో పలు సందర్భాల్లో కలెక్టర్ వచ్చారు. అక్కడే ఇన్‌స్పైర్ అయ్యాను. కలెక్టర్ అయితే పేద ప్రజలకు సమాజ సేవ చేయడంతో పాటు నాన్న కష్టం తీరుతుందని భావించాను. 2021లో బీటెక్ పూర్తి చేశాను. కుటుంబ ఆర్థిక సమస్యలు ఉండడంతో బీటెక్ పూర్తి కాగానే టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో జాబ్ మానేసి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. వరంగల్ సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేరై తొలి ప్రయత్నంలోనే 86వ ర్యాంకు సాధించాను. కలెక్టర్ కావాలన్న ఆకాంక్ష బలంగా ఉండడంతో బీటెక్ చదవుతున్నప్పటి నుంచే సమాంతరంగా ఐఏఎస్‌కు కావాల్సిన మెటీరియల్ స్వతహాగా రాసుకుని ప్రిపేర్ చేసుకున్నా. కోచింగ్ తీసుకోకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లు అయిన ఎంతో మంది ఇంటర్వ్యూలను ఓపిగ్గా గంటల తరబడి వీక్షించేవాడిని. వారు అనుసరించిన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. అలాగే కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాను. 86వ ర్యాంకు రావడం జోనల్ స్థాయిలో బీసీ–ఈ కమ్యూనిటీ కేటగిరీలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ర్యాంకును బట్టి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నాన్న కష్టం నన్ను నా లక్ష్యం వైపు నిలబడేలా చేసింది. నా రోల్ మోడల్ మా నాన్నే అన్ని సగర్వంగా చెప్పగలను. ఒక అక్క, ఇద్దరు చెళ్లెళ్ల పెళ్లి చేసి.. అమ్మ నాన్న సంతోషంగా ఉండేలా చూసుకోవడంప్రస్తుతం నాముందున్న కర్తవ్యం.
పేదరికమే.. సమాజ సేవ చేయాలన్న స్ఫూర్తినిచ్చింది
కలెక్టర్ కావాలన్నది నా ఆకాంక్ష
ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్స్ ర్యాంకు సాధించవచ్చు
గ్రూప్–1లో స్టేట్ 86వ ర్యాంకు సాధించిన మహ్మద్ విలాయత్ అలీ