
లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో గొడవ
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ (కొత్త బీట్‌బజార్) పక్కన ఏర్పాటు చేసుకున్న ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో రెండు వర్గాల మధ్య గొడవ మరింత ముదిరింది. తాజాగా బుధవారం ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన లారీలను ఎరువుల బస్తాలను అన్‌లోడ్ చేయడానికి తీసుకుని వెళ్తుండగా ఎత్తుగడ్డ ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతంలో అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన గీసుకొండ ఎస్సై ప్రశాంత్‌బాబు అక్కడికి చేరుకుని సమస్యలు ఉంటే మామునూరు ఏసీపీ వద్ద మాట్లాడుకోవాలని వారికి నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ క్లియర్ అయినా సాయంత్రం వరకు వైరి వర్గం వారు లారీల్లోని బస్తాలను అన్‌లోడ్ చేయకుండా అడ్డుకున్నారు. గతంలో లారీ ఓనర్స్ అసోసియేషన్‌ను ఏనుమాముల ప్రాంతంలో నిర్వహించేవారు. కొన్ని సంవత్సరాల క్రితం కొత్త బీట్‌బజార్ పక్కన ఏర్పాటు చేసుకున్నారు. అసోసియేషన్‌లో ఓ వర్గం వారు చాలా ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, లారీల కిరాయి ద్వారా వచ్చిన రూ.కోటికి పైగా డబ్బు లెక్కలు చూపించడం లేదని, గడిచిన 30 నెలల లావాదేవీల లెక్కలు చెప్పడం లేదని, ఏమైనా అంటే అసోసియేషన్ ఎన్నికల తర్వాత లెక్కలు చూపిస్తామంటూ దాట వేస్తూ బెదిరిస్తున్నారని మరో వర్గం వారు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ వర్గం వారు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు వెళితే, మరో వర్గం వారు తమకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
లోడ్ లారీలను వెళ్లనీయకుండా
అడ్డుకున్న ఓ వర్గం
అసోసియేషన్ లెక్కలు
చూపించాలంటున్న మరో వర్గం