
7 నుంచి టెన్త్ స్పాట్
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షలు ముగిశాయి. గత నెల 21 నుంచి ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. బుధవారం సోషల్ స్టడీస్ పరీక్షతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోనే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు నిర్వహించనున్నారు. కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌ను టెన్త్ స్పాట్ కేంద్రంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు టెన్త్ సబ్జెక్టుల పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ జరుగనుంది.
సీనియార్టీ ప్రకారం ఎస్‌ఏలకు విధులు
ఉమ్మడివ వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని టెన్త్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లలో సీనియార్టీ కలిగిన స్కూల్ అసిస్టెంట్లను అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా( ఏఈ), చీఫ్ ఎగ్జామినర్లుగా (సీఈ) నియమించారు. హనుమకొండ డీఈఓ డి.వాసంతి క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. మిగతా జిల్లాల నుంచి వివిధ సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లను వివరాలను తెప్పించుకుని సీనియార్టీ ప్రాతిపదికన నియమించారు. ఏఈలు, సీఈలుగా కలిపి మొత్తంగా 1,064 మంది స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. ఈమేరకు వారికి నియామక ఉత్తర్వులు కూడా పంపుతున్నారు. స్పెషల్ అసిస్టెంట్లుగా 450 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)లను కూడా నియమించారు.
ఈనెల 7న ఉదయం రిపోర్టు చేయాలి
కాజీపేటలోని టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి ఆయా ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్‌లో తీసుకోవాల్సిన పలు అంశాలను సంబంధిత అధికారులు వారికి తెలియజేస్తారు. అనంతరం టీచర్లు వాల్యుయేషన్ చేస్తారు. రోజుకు 40 జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేస్తారు. ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీచర్లు స్పాట్ వాల్యుయేషన్ విధుల్లో పాల్గొంటారు.
జవాబుపత్రాల రాక..
ఉమ్మడి జిల్లా క్యాంపునకు టెన్త్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్‌కు సంబంధించిన జవాబుపత్రాలు 2.27 లక్షలకు పైగా కేటాయించారు.
కొనసాగుతున్న కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ
టెన్త్ పరీక్షల జవాబు పత్రాలకు కాజీపేట ఫాతిమా హైస్కూల్‌లో కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఇద్దరు కోడింగ్ ఆఫీ సర్లు ఇద్దరు పీజీహెచ్‌ఎంలుగా వ్యవహరిస్తుండగా.. మరో 8 మంది పీజీహెచ్‌ఎంలు అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లుగా విధులను నిర్వర్తిస్తున్నారు.
15 వరకు స్పాట్ వాల్యుయేషన్
2.27 లక్షలకుపైగా జవాబు పత్రాలు
ఏఈలు, సీఈలు కలిపి 1,064 మంది
స్పెషల్ అసిస్టెంట్లు 450 మంది
కొనసాగుతున్న కోడింగ్, డీకోడింగ్
ఉమ్మడి జిల్లాకు కలిపి ఒకే క్యాంపు