తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌ | - | Sakshi
Sakshi News home page

తిమ్మంపేట చపాట మిర్చికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌ సర్టిఫికెట్‌ జారీ

Apr 3 2025 1:14 AM | Updated on Apr 3 2025 2:21 PM

తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌

తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌

సొంత లోగో, బ్రాండ్‌తో అమ్ముకునే వెసులుబాటు

అధిక ధర వచ్చే అవకాశముందని రైతుల్లో ఆనందం

సాక్షి, వరంగల్‌/దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో 80 సంవత్సరాల నుంచి రైతులే విత్తనాలు తయారు చేసుకుని పండిస్తున్న వరంగల్‌ చపాట మిరప ఇక అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందనుంది. 2024 నవంబర్‌లోనే ఈ మిరపకు అంతర్జాతీయస్థాయి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) లభించినా.. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్‌ కల్పిస్తూ కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ ఉత్తర్వులిచ్చింది. చైన్నెలోని ఇండియన్‌ పేటెంట్‌ సంస్థ జీఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ సర్టిఫికెట్‌ జారీ చేసింది. 

మహబూబాబాద్‌ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధనస్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్‌, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ సహకారంతో వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ చైన్నె సంస్థకు 2022లో దరఖాస్తు చేస్తే మూడేళ్లకు అధికారికంగా పేటెంట్‌ లభించింది. వరంగల్‌ చపాట మిరపలో రంగు ఎక్కువగా, కారం తక్కువగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడంతో అంతర్జాతీయస్థాయిలో 18వ ఉత్పత్తిగా జీఐ ట్యాగ్‌ లభించింది. ఈ పంట ఉత్పత్తిపై ముద్రించిన జీఐ ట్యాగ్‌ను స్కాన్‌ చేయడం వల్ల వినియోగదారులకు ఈ చపాట మిర్చి ప్రత్యేకత తెలుస్తుంది.

ఫలించిన తిమ్మంపేట రైతుల కృషి..

దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ లిమిటెడ్‌ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్‌ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్‌, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిర్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 10,951 మెట్రిక్‌ టన్ను లు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్‌ ద్వారా లబ్ధి పొందనున్నారు.

ఒకప్పుడు నడికూడ నుంచే..

ఒకప్పడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఉన్న నడికూడ మండలంలోనుంచే ఈ చపాట మిరప సాగు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచే నడికూడ ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల రైతులకు విత్తనాలు ఇచ్చా రు. ఇలా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగారంలోనూ అప్పటినుంచే సాగు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. 

సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని పంట పండించే వరంగల్‌ చపాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో రైతులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం వరంగల్‌ చపాట, టమాట మిరప, సింగిల్‌ పట్టి, డబుల్‌ పట్టి పేర్లతో దొడ్డు మిరపను దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో విరివిగా పండిస్తున్నారు. మార్కెట్‌లో ధర బాగా పలకడం, వరంగల్‌ జిల్లా వాతావరణం అనుకూలంగా ఉండటంతో సాగు చేస్తున్నారు. 

దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ లిమిటెడ్‌ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్‌ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలి గింది. ప్రస్తుతం వరంగల్‌, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిచ్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా 10,951 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్‌ ద్వారా లబ్ధి పొందనున్నారు.

మిరప రైతులు1
1/2

మిరప రైతులు

తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌2
2/2

తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement