
కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నా
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు గురువారం హనుమకొండలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాయడాన్ని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు సిరిమల్ల సదానందం, కార్యదర్శి చాడా జైహింద్ రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు జి.సంపత్‌రావు ఖండించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ న్యాయమైన హక్కులపై కేంద్ర సర్కారు సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన నినాదాలతో ధర్నాస్థలి దద్దరిల్లింది. కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, ఆయా సంఘాల నాయకులు ఎన్.ఐజాక్, ఆర్.సమ్మయ్య, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, పోస్టల్, ఆర్మీ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.