
సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ధర్నా
హన్మకొండ: దశాబ్దాల కాలంగా రక్తం చెమటగా మార్చి పనిచేసి జీవితాన్ని ధారబోసి ఉద్యోగ విరమణ చేసిన తమపై యాజమాన్యం, ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదదని.. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన హనుమకొండ, వరంగల్–2 డిపోల ఎదుట ధర్నా చేశారు. కార్మికులు మాట్లాడుతూ వయస్సులో ఉన్నప్పుడు సంస్థకు సేవ చేసిన తమకు కనీస పెన్షన్ లేదని, జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించలేదు.. గ్రాట్యుటీ ఇవ్వడం లేదు.. డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం లేదని వాపోయారు. 2022 ఏప్రిల్ నుంచి టెర్నినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఆర్‌పీఎస్ 2017 ఎరియర్స్, ఈపీఎస్‌కు పీఎఫ్ హయ్యర్ పెన్షన్, 2021 వేతన ఒప్పందం చేసి ఎరియర్స్ చెల్లించాలన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి, స్పౌజ్‌కు సూపర్ లగ్జరీ బస్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రిటైర్డ్ కార్మికులు కేఎస్.నారాయణ, ఎస్.ఎస్.చారి, ఎస్.వై.గిరి, టి.సునీత, యాదగిరి, సీహెచ్ సోమయ్య, బీయూ.చారి, వై.శ్రీనివాస్, సాజీద్, వై.గిరి. సమ్మయ్య పాల్గొన్నారు.