హన్మకొండ: హనుమకొండ జిల్లా భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెరిగిన భూగర్భ జలాలు.. నవంబర్ నుంచి క్రమేణా అడుగంటుతున్నాయి. హనుమకొండ జిల్లాలో డిసెంబర్ మాసాంతానికి 4.81 మీటర్లకు, జనవరి మాసాంతానికి 5.93 మీటర్ల లోతుకు, ఫిబ్రవరి మాసాంతానికి 6.30 మీటర్లకు, మార్చి మాసాంతానికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, నవంబర్ నుంచి యాసంగి పనులు మొదలు కావడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం 1,77,700 ఎకరాల్లో సాగు చేశారు. వరి, మొక్కజొన్నతోపాటు ఇతర మెట్ట పంటలకు సాగునీటి వినియోగం పెరిగింది.
ఐనవోలులో 22.64 మీటర్ల లోతు..
హనుమకొండ జిల్లాలో మార్చి చివరి నాటికి అత్యధికంగా ఐనవోలులో 22.64 మీటర్లకు, నడికూడ మండలం చర్లపల్లిలో 13.21 మీటర్లకు జలమట్టం పడిపోయింది. బోరుబావులు తవ్వించి 25 ఫీజో మీటర్లు, వరంగల్ జిల్లాలో 26 ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఫీజో మీటర్లు భూగర్భజల మట్టాన్ని రికార్డు చేస్తాయి. వీటి నుంచి భూగర్భ జలశాఖ అధికారులు నీటిమట్టం రికార్డును సేకరిస్తారు.
గట్లనర్సింగాపూర్‌లో 6.53 మీటర్ల లోతు..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌లో 6.53 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జగన్నాథపూర్‌లో 10.24, కొత్తపల్లిలో 9.23, వంగరలో 10.31, ధర్మసాగర్ మండలం ధర్మాపూర్‌లో 4.68, ధర్మసాగర్‌లో 3.65, పెద్దపెండ్యాలలో 9.68, నారాయణగిరిలో 4.61, ఎల్కతుర్తిలో 8.53, హనుమకొండలో 7.06, హసన్‌పర్తి మండలం నాగారంలో 8.49, సీతంపేటలో 4.56, ఎల్లాపూర్‌లో 3.68, ఐనవోలు మండలం పున్నేలులో 4.72, పంథినిలో 5.19, ఐనవోలులో 22.64, కమలాపూర్ మండలం శనిగరంలో 7.18, వేలేరు మండలం పీచరలో 10.43, వేలేరులో 3.48, ఆత్మకూరులో 3.17, దామెరలో 4.19, నడికూడ మండలం చర్లపల్లిలో 13,21, నడికూడలో 3.46, పరకాలలో 4.57, శాయంపేట మండలం పత్తిపాకలో 5.61 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి.
జిల్లాలో సగటున 7.16 మీటర్లు..
1,77,700 ఎకరాల్లో పంటల సాగు