వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులతోపాటు వారికి సరుకు అందజేసే.. స్వీకరించే వ్యక్తులను అరెస్ట్ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను పిలిపించడమే కాకుండా అధికారులు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని పరిసరాల్లో ఉండే వారి నుంచి రౌడీషీటర్ల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. ఆస్తి నేరాలకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యే నిందితుల సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ఈనేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్‌స్టేషన్ అధికారులు కూడా నిర్వహించాలని తెలిపారు. స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై అధికారులు తప్పనిసరిగా కేసులను నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, ఏఎస్పీలు చైతన్య, మనాన్‌భట్, అదనపు డీసీపీలు రవి, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.