వర్ధన్నపేట: వృద్ధురాలి నుంచి నగదు అపహరించిన దొంగను అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వర్ధన్నపేటకు చెందిన వృద్ధురాలు నందనం భారతమ్మ ఈ నెల రెండున వర్ధన్నపేట ఎస్‌బీఐ నుంచి రూ. మూడు లక్షలు డ్రా చేసింది. ఆమె డబ్బులు తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఆటో కోసం వేచి చూస్తుండగా మండలంలోని కడారిగూడేనికి చెందిన బత్తిని విజయ్‌కుమార్ వచ్చాడు. ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఆమెను స్కూటీపై ఎక్కించుకున్నాడు. ఇంటి సమీపంలో స్కూటీ ఆపకుండా ఫిరంగిగడ్డ వరకు తీసుకెళ్లి కోనాపురం రోడ్డు వద్ద దింపాడు. ఆమె దగ్గర ఉన్న రూ.మూడు లక్షల నగదు, సెల్‌ఫోన్, బ్యాంకు పాసుబుక్ ఉన్న బ్యాగుతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం కట్య్రాల గ్రామ సమీపంలో నిందితుడు విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి, రూ.మూడు లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. వెస్ట్‌జోన్ డీసీపీ బి.రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సై బి.చందర్, పోలీస్ సిబ్బంది కేసును దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వారిని అభినందించారు.
వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట
ఏసీపీ నర్సయ్య