
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ఖానాపురం: వైద్య సేవలందించడంలో రాష్ట్రంలో జిల్లా మధ్య స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్‌నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,775 పల్లె దవాఖానలు, సబ్‌సెంటర్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో అసంపూర్తిగా 30 ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేస్తామని తెలిపారు. ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ లోపంతోపాటు అలసత్వం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ హెచ్చరించారు. వేసవిలో ప్రజలు 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లొద్దని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, క్యాపులు ధరించాలని సూచించారు. డీహెచ్ వెంట డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, ఎన్‌సీడీపీఓ రవీందర్, టీబీ, మలేరియా ప్రోగ్రాం అధికారి ఆచార్య, ఆమ్ పీఓ విజయ్‌కుమార్, ఎన్‌సీడీ సూపర్‌వైజర్ ప్రకాశ్‌రెడ్డి, వైద్యులు జ్యోతి, అరుణ్‌కుమార్, సిబ్బంది రాంప్రసాద్‌రెడ్డి, భాస్కర్ ఉన్నారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్‌నాయక్
ఖానాపురంలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ