
జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణాభివృద్ధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. జిల్లాలో ఎస్‌బీఐ వారి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు స్టెప్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, టాస్క్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉందని, దీంతో పాటు పరకాలలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా ఉద్యోగావకాశాల కోసం శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, ఆర్.నాగరాజు మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీలత, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఎస్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కొంగర జగన్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.