
చామంతులతో లక్షపుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పసుపురంగు చామంతులతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం జరిపారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పసుపు రంగు చామంతిపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనకు కరీంనగర్‌కు చెందిన బాలజనని ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
నేడు హజ్
యాత్రికులకు శిక్షణ
న్యూశాయంపేట: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం (నేడు) హజ్ యాత్రికులకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ శనివారం తెలిపారు. వరంగల్ ఇస్లామియా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులు సకాలంలో వచ్చి శిక్షణలో పాల్గొనాలని కోరారు.
డీఈఈసెట్‌కు
దరఖాస్తు చేసుకోవాలి
విద్యారణ్యపురి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) డీఈఈసెట్– 2025కు నోటిఫికేషన్ విడుదలైందని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ అబ్దుల్‌హై శనివారం ఒక ప్రకటనలో కోరారు. మే 15వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష మే 25న ఉంటుందని తెలి పారు. ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించినవారు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45శాతం మా ర్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
వేసవిలో జాగ్రత్తలు
పాటించాలి
కాజీపేట అర్బన్: ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులు వేసవిలో తప్పకుండా జాగ్రత్తలు పాటించి పనులు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. కాజీపేట మండల పరిధి కడిపికొండ, భట్టుపల్లి, కొత్తపల్లి గ్రామ శివార్లలో ఇటుకబట్టీల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య సందర్శించి పలు సూచనలు చేశారు. ఓఆర్‌ఎస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
కవి రామా చంద్రమౌళికి
సాహిత్య పురస్కారం
హన్మకొండ కల్చరల్: హైదరాబాద్ వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రదానం చేయనున్న డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారానికి వరంగల్‌కు చెందిన కవి, రచయిత రామా చంద్రమౌళి ఎంపికయ్యారు. ఈమేరకు ఉగాది సంబరాల్లో భాగంగా ఏప్రిల్ 12, 13 తేదీల్లో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో రామాచంద్రమౌళికి ఈపురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వేతనాలు పెంచాలి..
గీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రా క్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తోందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరారు.

చామంతులతో లక్షపుష్పార్చన

చామంతులతో లక్షపుష్పార్చన