
ఒంటిమామిడిపల్లి పాఠశాల సందర్శన
పాఠశాల అభివృద్ధిపై ఆరా తీసిన
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్
ఐనవోలు: మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఆరుట్ల పాఠశాల విద్యా కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఒకప్పడు పాఠశాల మూతబడి.. తర్వాత మళ్లీ ఎలా పునఃప్రారంభమైందనే అంశాలను తెలుసుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? విద్యా కమిటీ పాఠశాల అభివృద్ధి కోసం దశల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంది? తదితర అంశాలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. పీఎంశ్రీ, వివిధ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. విద్యార్థులతో తరగతి గదిలో ముఖాముఖి మాట్లాడి డిజిటల్ తరగతులు ఎలా నడుస్తున్నాయని అడిగారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. అదేవిదంగా విద్యార్థులు ఉపయోగిస్తున్న టాయిలెట్లను పరిశీలించి సరిగ్గా నిర్వహించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ పాఠశాల సమస్యలను విద్యా కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు తరగతుల నిర్మాణం కావాలని, పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ ఎస్జీటీ, ఎస్‌ఏలు మాత్రమే ఉన్నారని పీజీ హెచ్‌ఎం అలాట్ కాలేదన్నారు. అదేవిదంగా పీఈటీ పోస్ట్ మంజూరు చేయించాలని కోరారు. అదేవిదంగా మన ఊరు మన పాఠశాల ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చించి పనులు చేయగా.. ఇంకా సుమారు రూ.5 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాలని మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ పొన్నాల రాజు పాఠశాల విద్యా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆ గ్రామ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పులి ఆనందం, తహసీల్దార్ విక్రమ్‌కుమార్, ఏఏపీసీ చైర్‌పర్సన్ సకీనాబీ, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.