
ఒకరి మెప్పు.. ప్రజలకు ముప్పు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని బస్టాండ్ మూలమలుపు హనుమాన్ టెంపుల్ నుంచి అలంకార్ వరకు చేపట్టిన స్మార్ట్‌సిటీ పనులపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరవాసులకు ప్రయోజనకరంగా ఉండాల్సిన అభివృద్ధి పనులను కొందరు ప్రైవేట్ వ్యక్తుల మెప్పు కోసం నిర్మాణాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.కోటి పనుల్లో ఇష్టారాజ్యం..
స్మార్ట్‌సిటీ పథకం ద్వారా రూ.కోటి నిధులతో 7, 10 డివిజన్ల పరిధి హనుమకొండ కొత్తబస్టాండ్‌కు వెళ్లే దారిలో మూలమలుపు నుంచి అలంకార్ వరకు దాదాపు 60 ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. నెల క్రితం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదించిన విధంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
డ్రెయినేజీ దారి మళ్లింపు..
బస్టాండ్ మూలమలుపులో పనులు ప్రారంభమైన మారెమ్మ చెట్టు వద్ద ఓ ప్రైవేట్ వ్యక్తి బడా షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నాడు. ఏడాది క్రితం ప్రారంభించిన ఈకాంప్లెక్స్ నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. కాంప్లెక్స్ ప్రధాన గేట్ ఎదుట నుంచి డ్రెయినేజీ ఉండగా.. ప్రస్తుతం దాన్ని పూర్తిగా మూసేశారు. అందుకోసం వేసిన సీసీ రో డ్డును రెండు రోజులకే తవ్వి కొత్తగా డ్రెయినేజీ కో సం కల్వర్టును నిర్మించారు. మచిలీబజార్ నుంచి మారెమ్మ చెట్టు ముందు భాగం, పింజర్ల వీధి మీదుగా చౌరస్తా పెద్ద నాలాలో కలవాల్సిన నీరు, ఇ ప్పుడు వంకర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
పొంచి ఉన్న ముంపు
కాంట్రాక్టర్ చేపట్టిన అశాసీ్త్రయ పనులతో వర్షాకాలంలో వరద ముంపు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీని అడ్డంగా నిర్మించడం వల్ల మచిలీబజార్, రాజ్‌పుత్ వాడ, అగ్గలయ్య గుట్ట నుంచి వచ్చే వరద నీరు సాఫీగా వెల్ల కుండా మారెమ్మ చెట్టు వద్ద నిలిచిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.