ఎల్కతుర్తి: కాంగ్రెస్ కొనసాగిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం సంక్షోభమైంది.. అభివృద్ధి అరాచకమైందని ఎమ్మెల్సీ మధుసుదనాచారి విమర్శించారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 12వందల ఏకరాల్లో ఈనెల 27న బీఆర్‌ఎస్ నిర్వహించే రజతోత్సవ సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సత్యసాయి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చారిత్రాత్మకమైన బీఆర్‌ఎస్ బహిరంగ సభ జరుగబోతుందన్నారు. తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కొనసాగిస్తోందన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టి స్వరాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్ధిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో గడిచిన పదేళ్లలో 4 లక్షల 15 వేల కోట్లు అప్పు తెస్తే.. 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 1లక్షా 60 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంపదను సృష్టించడానికి నిధులు ఖర్చు చేసిందని.. మారుమూల గ్రామానికి సైతం విద్యుత్ సమస్య లేకుండా చేసి తాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ బహిరంగ సభకు తరలివచ్చే 10 లక్షల మందికి సరిపడా నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ నిర్వహించేందుకు 12 వందల ఎకరాల స్థలం కేటాయించి ఇచ్చిన రైతులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభ పర్మిషన్ త్వరలోనే రానున్నట్లు వెల్లడించారు. ఈసభ ఒక కుంభమేళా మాదిరిగా జరుగబోతుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక నాయకులు పిట్టల మహేందర్, శ్రీపతి రవీందర్‌గౌడ్, గొల్లె మహేందర్, కడారి రాజు, ఎల్తూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మధుసుదనాచారి
బీఆర్‌ఎస్ రజతోత్సవ
సభా స్థలి పరిశీలన