
1నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
హన్మకొండ అర్బన్ : మే 1నుంచి జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, విజయవంతం చేసేందుకు సహకరించాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 1నుంచి 31వరకు పలు రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 9 (బుధవారం) నుంచి 25వ తేదీవరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. దాతల సహకారంతో శిబిరాల వద్ద క్రీడాకారులకు పండ్లు, పాలు, అల్పాహారం వంటివి అందించేందకు చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 22 అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునే విధంగా క్రీడా సంఘాలు కృషి చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి గుగులోత్ అశోక్ మాట్లాడుతూ క్రీడా శిబిరంలో 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని వివరించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటిన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, క్రికెట్, లాన్‌టెన్నీస్, సాఫ్ట్‌బాల్, హాకీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటిన్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 25వ తేదీలోగా హనుమకొండ జేఎన్‌ఎస్‌లోని కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ వైవీ గణేశ్, డీఈఓ వాసంతి, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు శ్యామల పవన్‌కుమార్, మహ్మద్ కరీం, పింగిళి రమేశ్ రెడ్డి, తోట శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం
హసన్‌పర్తి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇందిరమ్మ పైలెట్ ప్రాజెక్ట్ కింద పెంబర్తి గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారంపరిశీలించారు. మండల పరిధిలో ఉంటే తహసీల్దార్, పక్క మండలంలో ఉంటే ఆర్డీఓ ద్వారా ఇసుక కూపన్లు అందజేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్‌షాపును కలెక్టర్ తనిఖీ చేసి, సన్న బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ కర్ణాకర్ రెడ్డి, హౌజింగ్ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్ధార్థ నాయక్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, హౌజింగ్ ఏఈ నరేందర్ రాజ్, మాజీ సర్పంచ్ పూల, కారోబార్ సదానందం పాల్గొన్నారు.
ఆసరా మార్ట్ ప్రారంభం
హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో మహిళా సంఘం సభ్యుల కోసం ఏర్పాటుచేసిన ఆసరా మార్ట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఓమిని మార్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజ్ సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. మహిళలు మార్ట్‌ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శ్రీను, జీఎం ఇండస్ట్రీస్ నవీన్‌కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు, డీడబ్ల్యూఓ జయంతి, ఓమిని మార్ట్ ఎండీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య