
నిట్‌లో వెల్లువెత్తిన నిరసన
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఇటీవల సెకండియర్ విద్యార్థి హృతిక్ సాయి చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన హృతిక్‌సాయి సంస్మరణ సభలో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూనే విద్యార్థులు గేట్ వద్ద నిరసనకు దిగారు. నిట్‌లోని వివిధ క్లబ్స్‌లోకి 6.5 జీపీఏ సాధించిన విద్యార్థులకే కాకుండా మిగతా వారికీ అనుమతి కల్పించాలని, ఫస్టియర్ విద్యార్థులకు అటెండెన్స్‌కు పది మార్కులు, సమ్మర్ కోర్స్ రిజిస్ట్రేషన్ అందరికీ కల్పించాలని, రూ.లక్ష ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగిన వారికి ఫీజులో రాయితీ కల్పించడం తదితర డిమాండ్లు నెరవేర్చాలని నిరసన తెలిపారు. కాగా, విద్యార్థులతో త్వరలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని నిట్ యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. దీంతో వారు ఆందోళన విరమించారు.