
చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!
తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై కేసు
వరంగల్ క్రైం:
చనిపోయిన వ్యక్తి వచ్చి భూ కబ్జా చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసుల్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూడొచ్చు. 9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి అక్రమంగా భూమిలోకి చొరబడి, బెదిరింపులకు పాల్పడినట్లు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఏ–1 కింద కేసు నమోదు చేశారో పోలీస్ అధికారి. సివిల్ కేసుల్లో తలదూర్చవద్దని పోలీస్ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా.. కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నందుకు ఇదో ఉదాహరణ. భూదందాలకు చిరునామాగా మారిన ఆ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. తనకు నచ్చని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు, ఆపోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ కేసులో రెండు వర్గాలు రాజీకుదుర్చుకోగా.. రాజీ పడవద్దని ఒత్తిడి చేసి వివాదాస్పదుడిగా పేరు మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది.
చనిపోయిన వ్యక్తిపై కేసు..
ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 21న కొంత మంది వ్యక్తులు తన భూమిలోకి అక్రమంగా చొరబడి, హద్దు రాళ్లను పీకేసి ప్లాట్ల యజమానులను చంపుతామని బెదిరించినట్లు ఓ మహిళ ఆ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి విచారణ చేయకుండానే అదే రోజు పిటిషనల్‌లో పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ నంబర్ 47/2025 లో ఏ–1గా ఉన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి సుమారు తొమ్మిదేళ్లవుతోంది. ఎఫ్‌ఐఆర్ కాపీ చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఎక్కడినుంచి వచ్చి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి.. హద్దు రాళ్లు పీకేసి చంపుతానని బెదిరిస్తాడని ప్రశ్నిస్తున్నారు. మృతుడి బంధువులు అడిగితే నా ఇష్టం వచ్చిన వారిపై కేసు నమోదు చేస్తా. అవసరం అయితే నీపై (ప్రశ్నించిన వ్యక్తిపై ) కేసు పెడతానని సదరు అధికారి బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఏమీ చేయలేక సదరు అధికారిపై చిరుకోపం ప్రదర్శించి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. మిస్సింగ్, చిన్న చిన్న చీటింగ్ కేసులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి.. అవసరం అయితే వారు చెప్పిన సెక్షన్లు వచ్చేలా కేసులు నమోదు చేయడం పోలీస్ స్టేషన్లలో అనవాయితీ. అలాంటిది ఫిర్యాదు వచ్చీ రాగానే.. కనీసం అవతలి వ్యక్తులపై ఎలాంటి విచారణ లేకుండానే, వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలవకుండానే కేసులు నమోదు చేయడం సదరు అధికారికే చెల్లింది. బాధితుల భూమికి, ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేకపోవడం గమానార్హం.
చనిపోయిన వ్యక్తిపై నమోదైన ఎఫ్‌ఐఆర్
విచారించకుండానే..
చట్ట ప్రకారం.. పోలీస్‌స్టేషన్లలో భూదందాలకు సంబంధించిన కేసులు పట్టించుకోవద్దు. ఏది ఉన్నా న్యాయస్థానాల్ని సంప్రదించాలని సలహా ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లలో తాటికాయలంత అక్షరాలతో ‘ఇక్కడ భూ సమస్యలు పరిష్కరించబడవు. సివిల్ తగదాలకు పరిష్కారం లేదు’ అని రాసి ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనీసం విచారణ జరపకుండా రెండు వర్గాల అభిప్రాయాలు తెలుసుకోకుండా చేతిలో అధికారం ఉందని, కాసుల కక్కుర్తితో చనిపోయిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి నిబంధనలకు నీళ్లు వదిలారు. ఈ ఒక్క ఘటన వెలుగులోకి రాగా.. ఇలాంటి వెలుగు చూడని ఘటనలు మరెన్ని ఉన్నాయోననే అనుమానాలు కలుగుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడే కొంత మంది పోలీసు అధికారుల కారణంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుకున్న ఘన చరిత్ర మసకబారుతోందన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి శవాలపై కేసులు పెట్టే సదరు అధికారి అక్రమ దందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!

చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!

చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!