
నేనూ ధరణి బాధితుడినే!
గీసుకొండ/సంగెం: బీఆర్‌ఎస్ సర్కారు అమలు చేసిన ధరణితో రైతులతోపాటు తాను కూడా బాధితుడినేని, 8 ఎకరాల భూమి తన పేరిట కాలేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. గీసుకొండ మండలంలోని కొనాయమాకుల రైతువేదిక, సంగెం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సుల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యలు పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం 13 నెలలపాటు 18 రాష్ట్రాల చట్టాలను పరిశీలించి భూభారతి చట్టాన్ని రూపొందించిందని అన్నారు. రైతులకు అండగా ఉండేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని చెప్పారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జూన్ నుంచి పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల భూహక్కుల రికార్డుల్లో తప్పులను సవరించడానికి, పెండింగ్ సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించడానికి, పాస్ పుస్తకాల్లో భూపటం ఏర్పాటు చేయడానికి భూ భారతి చట్టం ఉపయోగపడుతుందని వివరించారు. పలువురు రైతు సంఘాల నాయకులు, రైతులు భూముల సమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భూభారతి చట్టం కరపత్రాలను ఆవిష్కరించారు. సదస్సుల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, అదనపు డీపీఆర్వో ప్రేమలత, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్‌కుమార్, ఎంపీడీఓలు కృష్ణవేణి, రవీందర్, ఏఓలు యాకయ్య, హరిప్రసాద్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
8 ఎకరాల భూమి నా పేర లేదు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
కొనాయమాకుల, సంగెంలో
భూభారతి అవగాహన సదస్సులు
హాజరైన కలెక్టర్
డాక్టర్ సత్యశారద, అధికారులు