తణుకు అర్బన్: తన ఇద్దరు కుమార్తెలను వదిలి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటే.. ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు అంజలి ఘటిస్తూ తణుకు నరేంద్ర సెంటర్‌లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన తెలిపింది. ఈ కార్యక్రమానికి మంత్రి కారుమూరి సంఘీభావం తెలిపి మాట్లాడారు.
తనకు సొంతిల్లు వచ్చిందని.. జగనన్న తన కల నెరవేర్చాడని తెనాలికి చెందిన గీతాంజలి ఒక యూట్యూబ్ చానల్‌కు ఎంతో భావోద్వేగంతో తెలిపిన తీరును ప్రజలంతా స్వాగతించారని, అది ఓర్వలేని టీడీపీ పచ్చ దొంగలు ఆమైపె సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మటమే కాకుండా అసభ్యకరంగా పెట్టిన పోస్టులకు చలించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గీతాంజలి విషయంలో స్పందించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయంతోపాటు అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఐటీడీపీ పేరుతో పెడుతున్న పోస్టులు ఎంతోమంది జీవితాలను చిదిమేస్తున్నాయని గీతాంజలి ఒక్క విషయమే బయటపడిందని చెప్పారు.
ఒక మహిళ ప్రభుత్వం వలన తనకు జరిగిన మంచిని చెప్పుకోవడం వలన ఇలా జరిగిందంటే ప్రతిపక్షాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముందుగా గీతాంజలి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మనన్ నత్తా కృష్ణవేణి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి రాము, తణుకు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, ఉండ్రాజవరపు గీత, ఎం.లలిత, ఫహీమా, కొఠారు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ, జనసేనవి నీచ రాజకీయాలు
బుట్టాయగూడెం: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ, జనసేన పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన నాలుగో విడత చేయూత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్స్‌ను తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల భర్త, పిల్లలు అన్యాయమైపోతారని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గీతాంజలి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
నడిపల్లిలో రాస్తారోకో
పెదవేగి : గీతాంజలిది ఆత్మహత్య కాదని టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్యగా పరిగణించి కారకులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టేటి స్టాలిన్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం నడిపల్లిలో గీతాంజలి మృతికి నిరసనగా రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ఉక్కుర్తి నాగేశ్వరరావు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడు ఎం. గోపాలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాఘవాపురంలో ర్యాలీ
చింతలపూడి: గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ గిరి భోగారావు డిమాండ్ చేశారు. బుధవారం చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ పడమటి ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి గీతాంజలి మృతికి శ్రధ్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో చుండూరి కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ, జనసేన వల్లే గీతాంజలి చనిపోయింది
తణుకు అర్బన్: టీడీపీ, జనసేన సామాజిక మాధ్యమాల్లో వేధించడం వల్లే తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని తణుకు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పొడుగు రామాచారి (రాము) అన్నారు. గీతాంజలి మృతికి బుధవారం తణుకు నరేంద్ర సెంటర్‌లో తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రభుత్వం తనకు దస్తావేజులతో కూడిన ఇంటిపత్రాలు ఇచ్చారని సంతోషంగా చెప్పిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన గీతాంజలిని ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించడం దారుణమని అన్నారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా తనకు అందిన సౌకర్యాన్ని చెప్పుకున్నందుకు ఆమె చనిపోయేంతగా వేధిస్తారా అని నిలదీశారు. వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గొల్తి హరికృష్ణప్రసాద్, కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, ఉపాధ్యక్షులు టేకు రాజు, ధవళేశ్వరపు సుబ్బారావు, కోరుమిల్లి సుబ్బారావు, నాగమల్లి సాయి, తమిరి శివకుమార్, ఉప్పరాపల్లి బాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment