యర్రగుంటపల్లిలో జీబీఎస్ కలకలం
చింతలపూడి: మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో ఐదేళ్ల బాలికకు గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైరస్ లక్షణాలు ఉన్నట్టు భావిస్తున్న వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. బాలికను పరీక్షించిన స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం బాలికకు అక్కడి జీజీహెచ్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. బాలిక నుంచి సేకరించిన శాంపిల్స్‌ను బెంగళూరు పంపించినట్టు వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి సోకిన రోగికి ఒళ్లంతా తిమ్మిరిగా మారి కండరాలు పట్టేయడంతో పాటు కండరాలు బలహీన పడతాయి అలాగే డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జీబీఎస్ లక్షణాలు బయటపడుతున్న నేపథ్యంలో గ్రామంలో వ్యాధి లక్షణాలు కనిపించడంతో కలకలం రేగింది.
వ్యాధి నిర్ధారణ కాలేదు
బాలిక పరిస్థితిపై పీహెచ్‌సీ వైద్యాధికారి కొత్తపల్లి నరేష్ వివరణ ఇస్తూ యర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ సోకినట్టు నిర్ధారణ కాలేదన్నారు. బాలికకు ఉన్న లక్షణాలను బట్టి శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కోసం బెంగళూరు పంపారన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా శనివారం బాలిక నివసించిన ప్రాంతంతో పాటు గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని వైద్యాధికారి నరేష్ చెప్పారు.
జంగారెడ్డిగూడెంలో ఐసోలేషన్ కేంద్రం
జంగారెడ్డిగూడెం: జీబీఎస్ వ్యాధిగ్రస్తుల కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బేబీ కమల మాట్లాడుతూ రాష్ట్రంలో జీబీఎస్ అనుమానిత కేసుల నియంత్రణలో భాగంగా ఇక్కడ ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. కండరాల బలహీనత, జ్వరం వంటి లక్షణాలున్న వ్యక్తులు ఏరియా ఆస్పత్రిలో సంప్రదించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని పరిసరాల శుభ్రతను, బయట ఆహార పదార్థాలను కొన్ని రోజులపాటు పూర్తిగా దూరం పెట్టాలని ఆమె సూచించారు.
ఐదేళ్ల బాలికకు వైరస్ లక్షణాలు
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ
యర్రగుంటపల్లిలో జీబీఎస్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment