ప్లాస్టిక్ భూతాన్ని పారదోలుదాం
కలెక్టర్ నాగరాణి
భీమవరం(ప్రకాశం చౌక్): క్యాన్సర్‌కు ప్లాస్టిక్ కారణంగా ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కొత్త బస్టాండ్ ఎదురుగా హైస్కూల్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భీమవరం పరిసర గ్రామాల్లో ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ పేషెంట్ కావడానికి ప్లాస్టిక్ కారణంగా ఉందని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు. పాస్టిక్ నిర్మూలనకు ఉద్యమ రూపంలో ముందడుగు వేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కోరారు. వ్యాపారులు ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు. కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్స్, స్టీల్ టీ కప్స్ వినియోగిస్తున్నట్టు చెప్పారు. జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి ప్లాస్టిక్ కవర్లను అందరూ తిరస్కరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. కలెక్టర్ చేతులమీదుగా మహిళలకు గుడ్డ సంచులు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వ్యాపారులకు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు.
చిరు వ్యాపారులపై జరిమానాలు తగదు
ప్లాస్టిక్ నిషేధం పేరుతో పట్టణంలో చిరు వ్యాపారులపై జరిమానాలు విధించడం కాదని, ఎక్కడ నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తులు వస్తున్నాయో తెలుసుకుని ఆపాలంటూ మాజీ కౌన్సిలర్ మెంటే గోపి అన్నారు. వెంటనే కలెక్టర్ కలుగజేసుకుని వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవగాహన లేకుండా మాట్లాడవద్దని హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment