హత్య కేసులో నిందితుల అరెస్టు
గణపవరం: నిడమర్రు మండలం బావాయిపాలెంలో జరిగిన యువకుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గణపవరం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వతేదీ రాత్రి బావాయిపాలెం గ్రామానికి చెందిన మజ్జి ఏసు(25) అనే వ్యక్తిని చంపివేసి చేయినరికి కాల్వలో పడవేసినట్లు కేసు నమోదైంది. ఈహత్య కేసును ఛేదించేందుకు ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు గణపవరం సీఐ ఎంవీ సుభాష్, గణపవరం, నిడమర్రు, చేబ్రోలు ఎస్సైలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్‌ల నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి, హత్యలో భాగస్వాములైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.
వివాహేతర సంబంధమే కారణం
ఈ కేసులో మొదటి ముద్దాయి పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసుకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ హత్యకు ప్రేరణ అన్నారు. మృతుడు తరచూ ముద్దాయి భార్యతో మాట్లాడటం, సెల్‌ఫోన్ మెసేజీలు పెడుతున్నాడన్న అనుమానంతో గతంలో కులపెద్దల సమక్షంలో తగవు పెట్టినా మృతుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడిని హతమార్చేందుకు పిల్లి ఏసుబాబు, అతని తండ్రి అన్నవరం, కోలమూరు గ్రామానికి చెందిన గెడ్డాడ శ్రీనివాసరావు పథకం రచించారు. ఈనెల 15వ తేదీన పిల్లి ఏసుబాబు తన భార్య ఫోన్‌లో ఆమె పెట్టినట్లుగా మజ్జి ఏసుకు ఫోన్‌లో మెసేజ్ పెట్టాడు. తాను ఉండి మండలం మహదేవపట్నంలో తన పుట్టింట్లో ఉన్నానని, రావాలని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన మజ్జి ఏసు మోటార్‌సైకిల్‌పై మహదేవపట్నం చేరుకుని, ఆమె ఇంటి డాబాపైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ముద్దాయిలు మజ్జి ఏసును పట్టుకుని దారుణంగా చావబాదారు. ఆ దెబ్బలకు తాళలేక మజ్జి ఏసు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆరా తీశారు. దీనితో మా గ్రామంలో కులపెద్దల సమక్షంలో తేల్చుకుంటామని చెప్పి మజ్జి ఏసును పిల్లి ఏసురాజు, గెద్దాడ శ్రీనివాసరావు మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని బావాయిపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బావాయిపాలెం శివారు కొత్తకోడుపుంత వద్ద ఆగారు. అప్పటికే అక్కడ కొబ్బరి గెలలుకోసే కత్తితో సిద్ధంగా ఉన్న పిల్లి ఏసుబాబు తండ్రి పిల్లి అన్నవరంతో కలిసి మజ్జి ఏసు కుడిచేతిని నరికివేశారు. చెయ్యిని కాలువలో పడేసి, బావాయిపాలెం శివారు పశువుల రేవు వద్ద మజ్జి ఏసును వదిలేసి వెళ్లిపోయారు. అధికరక్త స్రావంతో మజ్జి ఏసు కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వారు ఉపయోగించిన కత్తిని, మూడు మోటార్ సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment